ల్యాండాక్స్‌’తో సుల‌భ‌త‌రంగా భూసేవ‌లు
– లోగో ఆవిష్క‌రించిన రిటైర్డ్ ఐఏఎస్ బీఆర్ మీనా
– ఒకే వేదిక మీద భూసేవ‌లు, న్యాయ స‌ల‌హాలు

భూసేవ‌లు, భూముల‌కు సంబంధించిన‌ న్యాయ‌స‌ల‌హాల‌ను ఒకే వేదిక‌పై అందించాల‌నే వినూత్న ఆలోచ‌న‌తో మాధ‌వ్‌రెడ్డి, అత‌డి మిత్రులు క‌లిసి ‘ల్యాండాక్స్‌’ అనే స్టార్ట‌ప్‌ను ప్రారంభించ‌నున్నారు. ఈ సంస్థ లోగోను ఉగాది సంద‌ర్భంగా అమీర్‌పేట‌లోని గ్రీన్‌పార్క్ హోట‌ల్‌లో ఆవిష్క‌రించారు. న్యాయ నిపుణులు, భూచ‌ట్టాల నిపుణులు, విశ్రాంత రెవెన్యూ అధికారులు స‌ల‌హాదారులుగా ‘ల్యాండాక్స్‌’ సంస్థ‌ను ప్రారంభించ‌నున్నారు. ‘ల్యాండాక్స్‌’ సంస్థ భూసేవ‌ల‌ను సుల‌భ‌త‌రం చేస్తుంది. సింగిల్ క్లిక్ లేదా కాల్ చేస్తే.. భూముల‌కు సంబంధించిన స‌మాచారాన్ని అందించ‌డం, స‌ర్వే చేయించ‌డం, లీగ‌ల్ ఓపీనియ‌న్ ఇవ్వ‌డం వంటి సేవ‌ల‌ను అంద‌చ‌నుంది.

మ‌రో రెండుమూడు నెల‌ల్లో త‌మ సంస్థ సేవ‌ల‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్న‌ట్లు ల్యాండాక్స్‌ కోఫౌండ‌ర్ మాధ‌వ్‌రెడ్డి తెలిపారు. ప్ర‌పంచంలో ఎక్క‌డినుంచైనా ఈ సేవ‌ల‌ను పొంద‌వ‌చ్చ‌ని ఆయ‌న తెలిపారు. దేశ్యాప్తంగా త‌మ సంస్థ సేవ‌ల‌ను విస్త‌రించ‌నున్న‌ట్లు వివ‌రించారు. మారుమూల గ్రామం నుంచి మ‌హాన‌గ‌రం వ‌ర‌కు ఎక్క‌డైనా తమ సంస్థ సేవ‌ల‌ను అందిస్తుంద‌ని, ఒక్క వెబ్‌సైట్ క్లిక్ లేదా ఒక్క కాల్ చేయ‌డం ద్వారా ఇంటి వ‌ద్ద‌నే కావాల్సిన సేవ‌లు అందించ‌డం త‌మ సంస్థ ఉద్దేశ్య‌మ‌ని తెలిపారు.

‘ల్యాండాక్స్‌’ సంస్థకు చీఫ్ అడ్వైజ‌ర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీఆర్ మీనా ఉండ‌నున్నారు. సుప్రీం కోర్టు సీనియ‌ర్ న్యాయ‌వాది నిరూప్‌రెడ్డి అడ్వైజ‌ర్‌గా ఉండ‌నున్నారు. అడ్వైజ‌రీ బోర్డుకు భూచ‌ట్టాల నిపుణులు సునిల్ కుమార్ ఛైర్మ‌న్‌గా ఉన్నారు. అడ్వైజ‌రీ బోర్డులో రిటైర్డ్ డీఆర్వో రాజారావు, డిప్యూటీ క‌లెక్ట‌ర్ ల‌చ్చిరెడ్డి, ఇస్రో సైంటిస్ట్ రాఘ‌వేంద్ర‌, ఓఎన్‌జీసీ డిప్యూటీ జన‌ర‌ల్ మేనేజ‌ర్ కుమార‌స్వామి, లీడ్ ఇండియా సంస్థ కోశాధికారి ర‌వింద‌ర్‌, బొగ్గార‌పు శ‌ర‌త్‌, ప‌లువురు న్యాయ‌నిపుణులు, స‌ర్వే నిపుణులు, రిటైర్డ్ రెవెన్యూ అధికారులు స‌ల‌హాదారులుగా ఉండ‌నున్నారు.

‘ల్యాండ్‌డాక్స్‌’ లోగోను ప్రారంభించిన‌ బీఆర్ మీనా మాట్లాడుతూ… కీల‌క‌మైన‌, విలువైన భూముల‌కు సంబంధించిన సేవ‌లు సుల‌భ‌త‌రం చేయాల‌నే ఆలోచ‌న‌కు టెక్నాల‌జీని జోడించి ‘ల్యాండాక్స్‌’ సంస్థ‌ను ప్రారంభిస్తుండ‌టం అభినందించ‌ద‌గ్గ విష‌య‌మ‌న్నారు. ఇలాంటి సేవ‌లు అందించే సంస్థ‌లు ఈ రంగంలో లేవ‌ని, కాబ‌ట్టి ‘ల్యాండాక్స్‌’ సంస్థ ద్వారా ప్ర‌జ‌ల‌కు మేలు క‌లుగుతుంద‌ని పేర్కొన్నారు. భూముల‌కు సంబంధించిన చ‌ట్టాలు చాలా క్లిష్ఠ‌మైన‌వ‌ని, వివిధ శాఖ‌లకు చెందిన అనేక‌ చ‌ట్టాలు భూముల‌కు వ‌ర్తిస్తాయ‌న్నారు. ఇలాంటి స‌వాళ్ల‌ను ఎదురించి సామాన్యుల‌కు భూసేవ‌ల‌ను సుల‌భ‌త‌రం చేయాల‌నే ఆలోచ‌న‌తో యువ బృందం ‘ల్యాండాక్స్‌’ సంస్థ‌ను ప్రారంభించ‌డం మంచి ప‌రిణామ‌మ‌ని అన్నారు.

సుప్రీం కోర్టు సీనియ‌ర్ అడ్వ‌కేట్ నిరూప్ రెడ్డి ఈ కార్య‌క్ర‌మంలో వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో పాల్గొన్నారు. భూముల‌కు సంబంధించిన అన్ని రంగాల వారు అడ్వైజ‌ర్లుగా, యువ బృందం ప్రారంభిస్తున్న ‘ల్యాండాక్స్‌’ సంస్థ ద్వారా ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లు అందుతాయ‌న్నారు. వివిధ భూసంబంధిత సేవ‌ల‌ను ఒకే వేదిక‌పై అందించాల‌నే ఆలోచ‌న చాలా మంచిద‌ని పేర్కొన్నారు.

భూచ‌ట్టాల నిపుణులు సునీల్ కుమార్ మాట్లాడుతూ… భూరికార్డులు, భూచ‌ట్టాలు ఎవ‌రికీ అర్థం కాని బ్ర‌హ్మ‌ప‌దార్థాలుగా మారిపోయాయ‌ని, ఈ ప‌రిస్థితుల్లో ‘ల్యాండాక్స్‌’ సంస్థ భూముల‌కు సంబంధించిన సేవ‌ల‌న్నీ ఒకే వేదిక‌గా అందించే ఆలోచ‌న‌తో ముందుకురావ‌డం స్వాగ‌తించ‌ద‌గ్గ విష‌య‌మ‌ని పేర్కొన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో క్రెడాయ్ జాతీయ ఉపాధ్య‌క్షులు రామ్‌రెడ్డి, క్రెడాయ్ కార్య‌ద‌ర్శి రాజ‌శేఖర్ రెడ్డి, న్యాయ నిపుణులు, విశ్రాంత రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.